ట్విట్టర్ లో కూడా కుల వివక్ష
సోషల్ మీడియా అకౌంట్ కి అఫీషియల్ టిక్ మార్క్ అనేది ట్విట్టర్ ఎప్పటి నుంచో ఇస్తుంది. సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఉన్నంత క్రేజ్ మరో నెట్ వర్క్‌కు లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలైతే ట్విట్టర్‌ను విపరీతంగా ఉపయోగిస్తారు. చాలామంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారానే వారి విషయాలను మీడియాతో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టే ట్విట్టర్ కూడా ఆ అకౌంట్ వాళ్లదే అని తెలిసేట్టుగా బ్లూ-వెరిఫికేషన్ టిక్ ఇస్తోంది.
అయితే అది వారి అధికారిక అకౌంట్ అని తెలుసుకునేలా ప్రత్యేకంగా పరిగణిస్తుంది. మారిపోయిన పరిస్థితుల్లో ఆ బ్లూ టిక్ ఉండటం ఇప్పుడు కొందరు స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. ఇది ఇంతకుముందు కొంతమందికి మాత్రమే ఇచ్చేది. బిగ్ సెలబ్రటీలకు మాత్రమే అవకాశం ఇస్తుండేది. కానీ ఇప్పుడు సెలబ్రిటీలే కాకుండా మామూలు వ్యక్తులు కూడా ఆ టిక్ తెచ్చుకుంటున్నారు. అయితే అది కూడా కొందరు మాత్రమే తెచ్చుకుంటున్నారు.
ఈ క్రమంలో ఈ వెరిఫికేషన్ టిక్ అందరికీ ఎందుకు ఇవ్వట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. సంబంధిత వినియోగదారుని అకౌంట్ అతనిదే అని ధ్రువీకరిస్తే బ్లా మార్క్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు సామాన్య నెటిజన్లు. ఈ మేరకు ఓ హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ట్విట్టర్‌లోనే ఉద్యమం చేస్తున్నారు. #cancelallBlueTicksinIndia అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ ట్విట్టర్‌నే నిలదీస్తున్నారు భారతీయ నెటిజన్లు.
భారత్ లో ప్రతి ఒక్కరు సమానమే అని, భిన్నత్వంలో ఏకత్వం ఉండే భారతదేశంలో ఎవరికీ సెలబ్రిటీ స్టేటస్ లేదు దబాయించేస్తున్నారు నెటిజన్లు. బ్లూ టిక్‌లు ఇవ్వడం ద్వారా ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అని చెప్పినట్లుగా ఉందని ట్విట్టర్ ను నిలదీస్తున్నారు నెటిజన్లు. ఇండియాలో ఈ బ్లూ టిక్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అందరికీ తీసివెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వాలనుకుంటే అందరికీ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అంతేకాదు ఈ మార్క్ పొందడానికి ఎలాంటి విధానం అనుసరించాలో ఇప్పటి వరకు ట్విట్టర్ ప్రకటించలేదని స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ గుర్తింపు ఐడీ కార్డు, ప్రొఫైల్ పిక్, ఫోన్ నంబర్, మెయిల్ వంటివి ఏమైనా అందించాలా? అనే విషయాలను ట్విట్టర్ టీం ఇప్పటివరకు వెల్లడించలేదు. 2009 నుంచి ఈ వెరిఫికేషన్ బ్లూ టిక్ ట్విట్టర్ ఇస్తోంది. తొలినాళ్లలో సినిమా వాళ్లకు, క్రీడాకారులకు, వీఐపీలకు మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు జర్నలిస్టులకు కూడా ఇస్తుంది. సామాన్యులకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదనేది వారి ప్రశ్న.