ముంబై ATS చీఫ్ హేమంత్ కర్కరేను ఎవరు చంపారు?

జమ్మూలో మళ్లీ బాబు పేలుళ్లు జరిగాయట. ఇటీవల జరిగిన వాటిలో ఇది మూడో సారి అని చెబుతున్నారు. మొదటి రెండు సార్లు నేను మిస్ అయ్యానేమో. ఇప్పుడే ఈ పుస్తకం చదువుతుండటం వలన (ఇంకా పూర్తి కాలేదు) జరిగిన, జరుగుతున్నా విషయాలను లింక్ చేసుకోగలుతున్నాను.

‘Who killed Karkare?’ పుస్తకం రాసిన ఎస్ ఎం ముష్రిఫ్ మహారాష్ట్ర రిటైర్డ్ ఐజీ (పోలీస్). 1976 బాచ్ కి చెందిన ఈ ఆఫీసర్ మహారాష్ట్రలో పని చేస్తున్నప్పుడు తన పనిలో, పరిధిలో గమనించిన విషయాలను, అనుభవాలను ఈ పుస్తకంగా రాశాడు. ముస్లిం ఆఫీసర్ గా తను ఎదుర్కొన్న పరిమితులను, వాటిని అధిగమించటానికి పడిన ఇబ్బందులను ముందు మాటలో రాశాడు. వాటితో పాటు ఈయన గమనించి మనకు అందించిన సమాచారం చాలా విలువైనది. ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న నకిలీ యుద్ధాన్ని అర్ధం చేసుకోవటానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. 2009లో మొదటి ముద్రణ జరిగిన ఈ పుస్తకం ఉర్దూ, హిందీ, గుజరాతీ, తమిళ్, మలయాళం, కన్నడ, పంజాబీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో వచ్చి, ఐదు ముద్రణలు పొందింది. 2018 దాకా మరో నాలుగు సార్లు రీప్రింట్ అయ్యింది. మరి తెలుగులో ఎందుకు ఎవరూ పట్టించుకోలేదో తెలియదు.

ఆయన ‘bhrahmanites’ అనే పదం వాడాడు. బ్రాహ్మణులలో ఉండే ఆధిపత్య స్వభావం కలవారినీ, ఇతర కులాలలో ఉండే ఆధిపత్య భావాలు కలవాటిని కలిపి ఆయన ఆ పదం తయారు చేశాడు. బ్రాహ్మణులకూ, ముస్లిములకు అసలు వైరం ఎప్పుడూ లేదని చెబుతాడు. ముస్లిములు ఇక్కడ పరిపాలన చేసినపుడు కూడా బ్రాహ్మలు వారితో సంఖ్యతగానే ఉండి తమ పనులు చేయించుకొనే వారనీ, ముస్లిం పాలకులు కూడా మేధావులుగా వారికి తగిన గుర్తింపు యిచ్చేవారనీ చెప్పాడు. బ్రిటిష్ పాలన సమయంలో ఎప్పుడైతే సంస్కరణవాద ఉద్యమాలు బయలుదేరాయో అప్పుడే అసలు సమస్య బ్రాహ్మలకు వచ్చిందని అంటాడు. జ్యోతిరావు ఫూలే లాంటి వాళ్లు కులవ్యవస్థను ప్రశ్నించటం మొదలు అయ్యాక, అలాగే దక్షిణాదిన వచ్చిన పెరియార్ తదితర ఉద్యమాల తరువాత మామూలు హిందువులు ఆలోచించటం మొదలైయ్యింది. ప్రజలను చీలిస్తే తప్ప, ఉత్పత్తిలో పాలు పంచుకోలేని వర్గాలకు ప్రయోజనం ఉండదు కాబట్టి హిందూవులకు, ముస్లిములకు మధ్య వైషమ్యాలు పెంచి పోషించటం వెనుక బ్రాహ్మణైట్స్ కుట్ర ఉందని చెబుతారు. ఈ హిందూ ముస్లిం ఘర్షణలు కేవలం 1893 నుండి మాత్రమే మొదలయ్యాయని అంటాడు.

ఈ ఐ‌బి మొత్తం ప్రభుత్వాన్ని శాసిస్తుందనీ, ప్రధాన మంత్రికి కూడా చాలా విషయాలు తెలియనీయదనీ అంటాడు. గుజరాత్ అల్లర్ల తరువాత హిందూ మతోన్మాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా బద్ నామ్ అయ్యాక అవి పద్దతి మార్చుకొన్నాయనీ, తమ పధకాలను తమదే అయిన IB ద్వారా సాధించుకొంటున్నాయని అంటాడు. భారతీయ ముస్లిములను టెర్రరిష్టులుగా ఎక్స్ ఫోజ్ చేయటం, ఇక్కడి కామన్ హిందువులకు వారిని శత్రువులుగా మార్చటం ఇప్పటి వాటి వ్యూహం అని అంటాడు. గత ఇరవై ఏళ్లుగా ఈ భావాలను (ముస్లిం వ్యతిరేక భావాలను) కామన్ హిందువులకు కలగచేసి వాళ్ళు విజయం సాధించారనీ, ఈ భావజాలంతో చాలామంది జర్నలిశ్టులుగానూ, ఉద్యోగులుగానూ ప్రభుత్వంలో ప్రవేశించారనీ అంటాడు.

ఆ క్రమంలో ఏర్పడిన ఆర్ ఎస్ ఎస్ తదితర సంస్థలు బ్రాహ్మణైట్స్ ఏర్పాటు చేసినవేననీ, పేరుకి అవి హిందూ సంస్థలు అయినప్పటికీ అవి కేవలం బ్రాహ్మణైట్స్ ప్రయోజనం కోసం ఏర్పడినవనీ, కామన్ హిందువులను వాళ్లు పాచికగా వాడుకొంటారని అంటాడు. జండా మార్పు జరిగాక ప్రభుత్వ యంత్రాగాలలో ఈ బ్రాహ్మణైట్స్ చొచ్చుకొని పోయారనీ; ముఖ్యంగా ప్రెస్, ఇంటెలిజెన్స్ విభాగాలలో వీళ్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకొన్నారనీ అంటాడు. IB (Intelligence Buroa) పూర్తిగా బ్రాహ్మణైట్స్ అడ్డా అని చెబుతాడు. SAR జిలానీ (పార్లమెంట్ మీద జరిగిన దాడుల్లో ఒకప్పటి ముద్దాయి) తనను IB ఆఫీసులో విచారణ జరిపినపుడు అది IB ఆఫీసుగా కాకుండా, ఒక RSS స్థావరం లాగా అనిపించిందని చెబుతాడు. ఇక్కడ ఒక డైరెక్టర్ రిటైర్ అయితే ఇంకో బ్రాహ్మనైట్ అతని నామినేషన్ తోనే వస్తాడని ముషరీఫ్ అంటాడు. బ్రాహ్మణైట్స్ కానీ వారు ఈ సంస్థకు అధిపతులుగా ఉన్న సందర్భాలు చాలా తక్కువని అంటాడు.

విబ్రాంతి కలిగించే ఈ వివరాలకు ఆయన రుజువులు ఇచ్చాడు. Intteligense అంటే సమాచారాన్ని సేకరించి దాచి ఉంచాలని, అవసరం అయినపుడే వాడాల్సి ఉండగా వాటిని మీడియాలో ముందుగా తెలియచేయటం ఎంత వరకు సబబు? ఫలానా దగ్గర బాంబులు దొరికాయనో, లేక ఉన్నట్లు సమాచారం వచ్చిందనో మీడియాలో వార్తలు వదలటంలో వీళ్ళ వ్యూహం ఉంటుందని అర్థం అవుతుంది. ఒక్క చిదంబరం హోం మినిస్టర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ వార్తలు బయటకు తేవటం గురించి IB ని మందలించాడు. ఈ వార్తల ప్రచారంలో Times of India ముందు ఉండటం విశేషం.

హిందూ ముస్లిం టెర్రరిజం కాందహార్ విమాన హైజాకింగ్ అప్పుడు మాత్రమే కనిపించిందనీ మిగతావి ఏవీ ముస్లిం టెర్రరిజాలు కావని అంటాడు. బొంబాయి పేలుళ్లు, కోయంబత్తూరు పేలుళ్లు బాబ్రీ మసీదు విధ్వంస ప్రతీకార చర్యలు అనీ, వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ చెబుతాడు. తరువాత జరిగినవి అన్నీ ముస్లిం టెర్రరిజం ఉందనే ప్రచారాలు మాత్రమేనని మనకు వివరాలతో చెబుతున్నాడు.

ఒక దగ్గర టెర్రరిష్టు యాక్టివిటీ జరుగుతుందని ప్రచారం చేయటం, కొంతమంది ముస్లిములను ఎన్ కౌంటర్ చేయటం ఈ మధ్య తరచుగా జరుగుతుందని గమనించాలని అంటాడు. కాదూ అని చెప్పటానికి ఆ గుంపులో ఒక్క ముస్లిం కూడా బతికి ఉండడని అంటాడు.

ఇంకో పక్క అసలు టెర్రరిజం రైటిష్టు సెక్షన్లలో జరుగుతుందనీ, ఎక్కడెక్కడ వాళ్ళ ట్రైనింగ్ కార్యక్రమాలు జరిగాయో వివరాలు ఇచ్చాడు. బాంబుల తయారీలో చనిపోయిన రైటిష్టు కార్యకర్తల వివరాలు ఇచ్చాడు. హిందూ దేవాలయాలు, ప్రభుత్వ నిర్మాణాల దగ్గర వీళ్లు బాంబు దాడులకు ప్రయత్నిస్తారనీ అవి సక్సెస్ అయితే ముస్లిములే చేసినట్లు ప్రచారం అవుతుందనీ కొన్ని సందర్భాలఉదాహరించాడు

నా కామన్ సెన్స్ కు ఈ పుస్తకంలో వచ్చిన అనేక విషయాలు నిజమని అర్థం అయ్యింది. ఈ పుస్తకం చదవటానికి ఇంతకంటే మంచి సందర్భం లేదు.r

The Author Rama Sundari is Vice President of Progressive Organisation For Women – POW, Andhra Pradesh. Views are personal.