February 9 సంత్ రవిదాస్ జయంతి

నేడు February 9 సంత్ రవిదాస్ జయంతి

భగంతునికి అందరూ సమానులే అన్న సంత్ రవిదాస్

‘కులం కాదు గొప్పది, కులం కన్నా కర్తవ్యం ప్రధానం.. ధర్మమే సత్యం, మదిలో నింపుకోండి ధర్మాన్ని..ధర్మం- కర్మం రెండూ సమానం..’
‘సృష్టి జరిగింది ఒకే జ్యోతితో.. అందరూ దేవుని పుత్రులే, కులం-ప్రాంతం బేధం లేదు.. అందరూ సమానమే.. బ్రాహ్మణులైనా, చమారులైనా ఎక్కువ, తక్కువలు లేవు..’
‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా వారి పవిత్ర కర్మలే శ్రేష్టత్వాన్ని నిర్ణయిస్తాయి..’

సంత్ రవిదాస్ బోధనలివి

ఉత్తర భారత దేశంలో ఏడు శతాబ్దాల క్రితం భక్తి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆధ్యాత్మిక యోధుడు, కర్మయోగి సంత్ రవిదాస్.. పేదరికంలో అందులో చర్మకార (చమార్) వృత్తిని నిర్వహిస్తూ గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకునిగా నిలిచారు.
భక్తికి, జ్ఞానానికి కులం ప్రధానం కాదు. పెద్దగా శాస్త్రాలు చదువాల్సిన అవసరమే లేదు. సన్మార్గంతో భగవంతున్ని చేరుకోవచ్చని నిరూపించారు సంత్ రవిదాస్.
సంత్ రవిదాస్ ఎప్పుడు జన్మించారనే విషయంలో భిన్నవాదనలున్నాయి. 1377 లేదా 1399 సంవత్సరంలో ఆయన జన్మించాడని అంటారు. మరి కొందరు 1450లో జన్మించారని చెబుతున్నారు. పవిత్ర కాశీ నగరానికి సమీపంలోని సీర్ గోవర్ధన్‌పూర్‌కుచ గ్రామంలో మాఘ పూర్ణిమ నాడు ఖల్‌సాదేవి, సంతోస్ దాస్ దంపతులకు రవిదాస్ జన్మించారు. రవిదాస్ పేరును రైదాస్ అని కూడా చెబుతారు. చమార్ కులంలో జన్మించిన రవిదాస్ చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక జీవితం పట్ల మక్కువ పెంచుకున్నారు. గంగానదిలో స్నానం చేసి, అక్కడ సాధుసంతులు చేసే బోధనలను శ్రద్దగా ఆలకించేవారు.. తాత్విక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన రవిదాస్ భగవంతున్ని స్థుతిస్తూ కీర్తనలు, భజనలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం ఆయన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసేవి.. రవిదాస్ ధోరణి పట్ల ఆందోళన చెందాడు ఆయన తండ్రి పెళ్లి చేస్తే కానీ దారిలోకి రాడని భావించారు. అలా లోనాదేవితో చిన్న తనంలోనే వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్నా ఆధ్యాత్మిక మార్గాన్ని వీడలేదు రవిదాస్. లోనాదేవి తన భర్తను చక్కగా అర్ధం చేసకుంది. ఇద్దరూ కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకుంటూ దైవ చింతనను కొనసాగించారు..

రవిదాసు ఎంతో శ్రద్దగా పాదరక్షలు కుట్టేవాడు. అయితే దాన్ని ఆదాయవనరుగా భావించలేదు. తీర్థయాత్రులు చేసే సాధుసంతులకు ఉచితంగా ఇచ్చేవాడు.. దీంతో భక్తి గడవడం కష్టమైంది. దుర్భర దారిద్ర్యంలో ఉన్నదాంట్లోనే సరి పెట్టుకుంటూ భక్తి మార్గంలో పడిచేవాడు రవిదాస్. క్రమంగా రవిదాస్ కీర్తి అందరికీ తెలియడం మొదలైంది.. పేదరికంలో ఉన్న ఆయన్ని ఆదుకోవాలని భావించారు సంత్ ప్రేమానంద్.. రవిదాసుకు పరుసవేదిని బహుకరించారు. దానితో ఇనుమును తాకితే బంగారం అవుతుందని, ఆర్ధిక పరిస్థితుల నుండి గట్టెక్కవచ్చని సూచించాడు. రవిదాస్ దాన్ని తీసుకోడానికి ఇష్టపడలేదు. ప్రేమానంద్ వత్తిడితో అయిష్టంగానే తీసుకొని చూరులో పెట్టేశాడు. రవిదాస్ దృష్టి దానిపై పడనేలేదు.. తన జీవితం ఎప్పటిలాగే గడుస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత సంత్ ప్రేమేనంద్ మరోసారి రవిదాస్ పూరిపాకకు వెళ్లారు. రవిదాస్ పేదరికం నుండి గట్టెక్కి ఉంటాడని భావించారాయన. కానీ పరుసవేది పెట్టిన చూరులోనే అలాగే భద్రంగా ఉంది. రవిదాస్ నిరాడబరమై జీవితంలోనే అలౌకిక ఆనందం పొందుతున్నాడని గ్రహించి ఆయనకు సవినయంగా నమస్కరించారు ప్రేమానంద్..

చిత్తోడ్ గడ్ రాజపుత్ర యోధుడు రాణా సాంగా తల్లి రతన్ కువారీకి రవిదాసు గురుంచి తెలుసుకుంది. తన సైన్యంతో సహా వచ్చి రవిదాస్ పూరిపాక ముందు సవినయంగా మోకరిల్లి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. రతన్ కువారీ కోరిక మేరకు రవిదాసు, ఆయన సతీమణి లోనాదేవి చిత్తోడ్ గడ్ వెళ్లారు.. అక్కడ వారిని ఘనంగా సత్కరించి ఏనుగు అంబారీపై ఊరేగించారు.. రాణా సాంగా భార్య మీరాబాయి కూడా రవిదాస్ శిష్యురాలిగా మారిపోయారు. రవిదాస్ ఖ్యాతి నలు దిశలా వ్యాపించింది.. కాశీ మహారాజ దంపతులతో సహా ఎందరో రాజులు, రాణులు, సాధుసంతులు రవిదాస్ బోధనల పట్ల ఆకర్శితులై ఆయన శిష్యులుగా మారారు. సంత్ రవిదాస్ చిత్తోడ్ లోనే తన 120వ ఏట చైత్రశుద్ద చతుర్ధశి నాడు భగవంతునిలో లీనమైపోయారు.

కామ్ కర్తే రహో.. నామ్ జప్తే రహో.. భుక్తి కోసం పని చేస్తుకుంటూనే ఆధ్యాత్మిక చింతనను ఎలా అనుసరించాలో ఆచరణలో చూపించారు సంత్ రవిదాస్.. రవిదాస్ బోధనలు కీర్తనల రూపంలో దోహాలుగా ప్రసిద్ది కెక్కాయి. సమాజంలో కులం, అంటరానితనం, దురాచారాలను తీవ్రంగా నిరసించారాయన. భగవంతున్ని చేర్చేది కేవలం భక్తి మార్గమే అని, కులం కన్నా గుణమే ప్రధానం అని బోధించారు. దేవునికి అందరూ సమానమే అని చాటి చెప్పారు. మొఘలుల పాలనలో దుర్భర కష్టాల్లో ఉన్న హిందూ సమాజంలో ఐక్యత సాధించడంలో రవిదాస్ బోధనలు దోహదపడ్డాయి. సంత్ రవిదాస్ బోధనలను సిక్కుల ఐదో గురువు అర్జున్ దేవ్ పవిత్ర గ్రంధం గురు గ్రంధసాహిబ్ లో చేర్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన అస్పృశ్యులు ఎవరే అనే గ్రంథాన్ని సంత్ రవిదాస్ కు అంకితం ఇచ్చారు. సంత్ రవిదాస్ బోధనలు ఉత్తర భారత దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆయన సందేశం నుండి స్పూర్తి పొందారు.. రవిదాస్ సూచించిన మార్గం అందరికీ, ఎప్పటికీ, అన్ని వేళలా అనుసరనీయం.