అమ్మ నంగేలీ

మా తాతలు సంస్కర్తలు అని విర్రవీగే ఓ బ్రాహ్మణ సమాజమా
మా చరిత్ర ఘనమైన పరంపర అని బోర విరుచుకునే ఓ హైందవ సమాజమా
వీరేశలింగం సతీ సహగమనాన్ని నిరోధించాడనీ, విధవా వివాహాలను ప్రోత్సహించాడనీ రొమ్ములు చరుచుకునే ఓ వికృత వర్ణ వ్యవస్థా
రొమ్ముల పరిమాణాన్ని బట్టి దళిత స్త్రీ’ల మీద పన్నువిధించిన పశువులు మీరని మీకు తెలుసా? రొమ్ముల సైజును ఎప్పుడంటే అప్పుడు కొలుచుకుని పన్ను రాబట్టడానికి అనుకూలంగా దళిత అమ్మలకు రవిక తొడుక్కునే హక్కుని లేకుండా చేసిన వారసత్వం మీదని ఎరుగుదురా?
రండి ఈ పూట మీకు మాయమ్మ నంగేలీ కథ చెబుతాను
కాలం: పందొమ్మిదో శతాబ్ధం.
ప్రదేశం: ట్రేవెంకోర్ (కేరళా)

ములక్కారం – చన్నుల మీద పన్ను. ట్రేవెన్ కోర్ ప్రభువుల వికృత పరిపాలనకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇంటింటికీ తమ వసూలు దాదాలను పంపి, ఇంట్లో ఉన్న స్త్రీలను బయటకు లాగి వారి చన్నుల పరిమాణాన్నిబట్టి వారి వద్దనుండి పన్నులు వసూలు చేసే పద్ధతిని అరాచకంగా అమలు చేస్తూ తమ ఇష్టదైవమైన పద్మానాభుని బొక్కసాన్ని నింపడంలో తరించిపోయిన ఈ ఏలికల పాలనలోనే ఆ దేవుడు అంతటి ఐశ్వర్యవంతుడు కాగలిగాడు.
నంగేలీ చేర్తాళ లోని ఏజవా జాతికి చెందిన ఒక దళిత ఆడపడుచు. ఎప్పటిలానే వసూళ్ళ దాదాలు ఇంటిముందు నిలబడి రొమ్ములను చూపించడానికి ఆ తల్లిని బయటకు రావల్సిందిగా అరుస్తున్నారు. ఎంత అవమాన పడిందో… గొండె ఎంత చివుక్కుమందో.. మారని తమ తలరాతలను చూసుకుని ఎంత వ్యధ చెందిందో తల్లి.. ఇంట్లో వున్న కత్తి తీసుకుని తన రొమ్ముల్ని కోసి అరిటాకులో పెట్టి దాదాల ముందుకు తెచ్చి అక్కడే నేలకొరిగింది. రక్తస్రావాన్ని చూసిన దాదాల గుండెలదిరి అక్కడినుండి పరుగందుకున్నారు. గూడెం రగిలి పోయింది.
వార్త ఆ ప్రాంతమంతా అగ్గయ్యింది. తీవ్రమైన ఈ కోపాన్ని నిరోధించడానికి ఏలికలు ఆ పన్నును ఎత్తివెయ్యక తప్పలేదు.
కాని నంగేలీ అమ్మ రక్తస్రావంతో , నొప్పితో విలవిల లాడుతూ మరణించింది. శోకాన్ని తట్టుకోలేని ఆమె నిస్సహాయ భర్త అదే చితిలో దూకి తనువు చాలించాడు. చరిత్రలో రికార్డైన మొట్టమొదటి పతీ సహగమనం అది.
ఇప్పుడు చెప్పండి, బ్రాహ్మణ సంస్కర్తల పేర్లను భజన చేసే నయా మనువులారా… ఎవరి జీవితాలను ఎవరు సంస్కరించారూ? మీ కులాల్లో స్త్రీలను అణగదొక్కడానికి మీరు ఏర్పరచుకున్న మీ దురాచారాలను మీరే సంస్కరించుకుని అది మీరు మొత్తం సమాజనికి చేసిన సేవగా ప్రచారం చేసుకోడానికి సిగ్గు లేదూ? సతీ సహగమనం, వరకట్నం, విధవా వివాహలు లేకపోవడం మా సమస్యలు కానే కాదు.అవి దళిత జాతిలో ఆచరించిన దురాచారాలు కానే కావు.

దళితుల మీద మీరు అమలు చేసిన అకృత్యాలను ఎన్నిటినో చరిత్రనుండి మీరు చెరిపేసినా నంగేలీ అమ్మ కథ మాత్రం ఇప్పటికీ చరిత్రలో లిఖితపూర్వకంగా నిలబడిపోయింది.
ఆమె ప్రాణత్యాగంతో అభిమానాన్ని కాపాడుకున్న ఆ ప్రాంతపు పడుచులు ఆ ప్రదేశానికి పెట్టుకున్న పేరే ములాచ్చిపరంబు (రొమ్ములున్న అమ్మల దేశం).

మరెప్పుడూ ఇక మీ సంస్కర్తల గురించీ, మీ వైదిక వైభవాల గురించీ, మీ తాతల నేతుల మూతుల గురించీ ఆట్టే విర్రవీగకండి. సిగ్గుంటే అనంత పద్మనాభుని ఐశ్వర్యాన్ని కరిగించి అసలు హక్కుదార్లైన ఆ దళిత ప్రజకు పంచిపెట్టండి.